||సుందరకాండ ||

||పదహారవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ప్రశస్య తు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవ|
గుణాభిరామం రామం చ పునః చింతాపరోఽభవత్ ||1||
స|| హరిపుంగవః ప్రశస్తవ్యం తాం సీతాం ప్రశస్య గుణాభిరామం రామం చ ( ప్రశస్య) పునః చింతాపరః అభవత్ ||
తా|| ఆ హరిపుంగవుడు ప్రశంసింప తగిన ఆ సీతను అలాగే గుణాభిరాముడగు రాముని కూడా ప్రశంసించి మరల చింతాక్రాంతుడయ్యెను
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షోడశస్సర్గః

ఆ హరిపుంగవుడు ప్రశంసింప తగిన ఆ సీతను అలాగే గుణాభిరాముడగు రాముని కూడా ప్రశంసించి మరల చింతాక్రాంతుడయ్యెను.

ఆ హనుమంతుడు ఒక క్షణము ఆలోచించి భాష్పములతో నిండిన కళ్ళు కలవాడై సీతను గురించి ఇలా అనుకుంటూ విలపింపసాగెను, 'గురువులను గౌరవించు లక్ష్మణునకు మాన్యురాలు, గురువు వంటి రామునికి ప్రియురాలు అయిన సీతా దుఃఖములలో మునిగి యున్నది అంటే విధి ఎవరికి తప్పదు అన్నమాట. రాముని కృతనిశ్చయాన్ని, ధీశాలి అయిన లక్ష్మణుని కర్తవ్యనిష్టను తెలిసిన సీత పొంగిపొరలుతున్న గంగలాగ కలవర పడటము లేదు. శీలములో వయస్సు లో తుల్యులు గుణములలో తుల్యులు అగు వీరిలో రాఘవుడు వైదేహి కి తగినవాడు అలాగే నల్లని కళ్ళు గల ఆమె రామునకు తగినది".

ఆ హనుమంతుడు కొత్త బంగారములాగా లక్ష్మీదేవిలా వున్నాఅమెను చూచి మనస్సులో రాముని చేరి ఈ వచనములను అనుకొనెను.

'ఈ విశాలాక్షి కోసము వాలి వధింపబడెను. రావణునితో పరాక్రమములో సామానులైన కబంధుడు చంపబడెను. వనములో జరిగిన యుద్ధములో భీమవిక్రముడైన రాక్షసుడు విరాధుడు రామునిచేత మహేంద్రునిచే చంపబడిన శంబరుని వలె చంపబడెను. జనస్థానములో అగ్నిశిఖలతో సమానమైన బాణములతో పదునాలుగువేల భీమపరాక్రమము గల రాక్షసులు చంపబడిరి. మహాతేజోమయుడైన ఆత్మను తెలిసికొనిన రామునిచేత ఖరుడు అలాగే దూషణుడు చంపబడిరి. ఈమె కారణమువలననే సుగ్రీవునకు వాలిచే పాలింపబడిన దుర్లభమైన వానరరాజ్యము పొందబడినది. వానరులకు ఇశ్వర్యము కూడా కలిగినది. ఈ విశాలాక్షి కొఱకే నేను నదినదములకు పతి అయిన సాగరుని దాటి వచ్చితిని. ఈ నగరము కూడా నిరీక్షించితిని. ఈమె కోసము ఒకవేళ రాముడు సముద్రములతో పర్వతములతో కూడిన ఈ జగత్తుని తలక్రిందులు చేసినప్పటికీ తప్పు లేదు అని నాకు తోచుచున్నది. ముల్లోకములరాజ్యమా సీతా అని తూచితే ముల్లోకములరాజ్యము సీతకు దీటుకాదు'.

'వరిపండించు క్షేత్రములో హలము ద్వారా శుభకరమైన పద్మరేణువుల తో భూమిని చేదించి పైకి వచ్చిన, ఆ మిథిలానగరపు మహాత్ముడు, ధర్మశీలుడు అగు జనకమహారాజు యొక్క పుత్రీ, అగు ఈ సీత భర్తపై నిలబడిన పతివ్రత. ఈమె యశస్విని విక్రాంతుడు ఆర్యశీలుడు యుద్ధములో తిరుగులేనివాడు అగు దశరథుని పెద్ద కోడలు'.

'ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు ఆత్మను తెలిసికొనినవాడు అగు రామునియొక్క ప్రియమైన పత్ని అగు సీతా రాక్షసుల వశము లో ఉన్నది. ఈమె అన్ని భోగములను త్యజించి భర్త సేవలోనే మునిగి కష్టములగురించి ఆలోచించక నిర్జనమైన వనమును ప్రవేశించెను. ఈమె ఫలమూలములతో సంతుష్టురాలై భర్తృసేవలో అత్యంత ఆసక్తికలది. వనములో కూడా రాజభవనములో ఉన్నట్లు ప్రీతి పొందినది. ఈ కనకవర్ణాంగి ఎల్లప్పుడు స్మితవదనముతో భాషించు ఈమె ఆనర్థమైన యాతనలను సహించుచున్నది. రాఘవుడు రావణునిచే పీడింపబడుతున్న ఈమెను పిపాసుడు చలివేంద్రమును చూచుటకు తహతహలాడునట్లు చూచుటకు అర్హుడు'.

'రాఘవుడు ఈమెను మరల పొందినప్పుడు రాజ్యముకోలుపోయి తిరిగి సంపాదించినప్పుడు పొందు సంతోషమును పొందును. కామభోగములను పరిత్యజించి బందుజనములకు దూరమై ఈమె మరల భర్తతో సమాగముకోసము జీవితము ధరించియున్నది. ఈమె కి రాక్షసులు కానరారు. ఫలపుష్పములు కల వృక్షములు కూడా కానరావు. హృదయములో యున్న రాముడొక్కడే కనపించును. భర్త అనే భూషణము భూషణములలో అన్నింటికన్న దీటైన భూషణము. ఆ భూషణము లేకపోతే భూషణముకు అర్హురాలైనప్పటికి ఆమె శోభించదు. రాముడు దుఃఖమును సహిస్తూ ఈమె లేకుండా దేహమును ధరించుచున్నాడు అంటే ఎవరికి సాధ్యము కాని పని చేస్తున్నాడన్నమాట. నల్లని కేశములు కలది, పద్మములవలె నున్నకనులు కలది, సుఖజీవనమునకు అర్హురాలైనప్పటికీ దుఃఖములో నున్న ఈమెను చూచి నా మనస్సుకూడా క్షోభిస్తున్నది'.

'సహనములో భూదేవి వంటి , పద్మములవంటి కన్నులు గల, రామలక్ష్మణులచే రక్షింపబడిన ఈమె ఇప్పుడు వికృతమైన కళ్ళు గల రాక్షసస్త్రీలచేత చుట్టబడి చెట్టుకింద ఉన్నది. మంచుదెబ్బతగిలన తామరపూవు వలె శోభనుకోలుపోయిన , కష్టపరంపరలతో పీడింపబడుచున్నజనకుని కూతురు మగచక్రవాకమును కోలుపోయిన ఆడ చక్రవాకమువలె దీనమైన స్థితిలో ఉన్నది. పుష్పభారముచే వంగిన అశోక వృక్షములు, మంచుతొలగి పోవడముతో వెలాది కిరణములతో వెన్నెలకురుపిస్తున్న చంద్రుడు, భర్త ఏడబాటులో నున్న ఈమెలో దుఃఖమును పెంపొందిస్తున్నాయి'.

ఈవిధముగా బలశాలి , వానరులలో శ్రేష్టుడు అయిన హనుమంతుడు అన్ని విషయములను పరిశీలించి ఈమె సీతయే అని నిశ్చయించుకొని ఆ వృక్షములో తనను తాను మరుగుపరుచుకొని కూర్చునియుండెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదహారవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ఇత్యేవ మర్థం కపిరన్వవేక్ష్య
సీతేయ మిత్యేవవినిష్ట బుద్ధిః|
సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే
బలీ హరీణాం వృషభస్తరస్వీ||32||
స|| ఇతి ఏవం బలీ హరీణాం వృషభః కపిః అర్థం ( సీతాం) అన్వేక్ష్య ఇయం సీతా ఇతి ఏవ వినిష్టబుద్ధిః తస్మిన్ వృక్షే సంశ్రిత్య నిషసాద||
తా|| ఈవిధముగా బలశాలి , వానరులలో శ్రేష్టుడు అయిన హనుమంతుడు అన్ని విషయములను పరిశీలించి ఈమె సీతయే అని నిశ్చయించుకొని ఆ వృక్షములో తనను తాను మరుగుపరుచుకొని కూర్చునియుండెను
||ఓమ్ తత్ సత్||